•    Follow Us 
విశ్వబ్రాహ్మణుల ధర్మాలు:
విశ్వబ్రాహ్మణ వ్యక్తి పేరుకు ముందు ఇంటిపేరు, దానికి ముందు "బ్రహ్మశ్రీ" అని, పేరుకు చివర ఆచార్యులు, శర్మ , శాస్త్రి అని వ్రాయుట ధర్మము. (వృత్తి పేర్లు ఇంటిపేరుగా, కులం పేరుగా చెప్పుకొనరాదు. వ్రాసుకొనరాదు) | గోత్రం, ప్రవర, సూత్రం, కుండం, దండం, శాఖ వివరములు తెలుసుకొని వాటిని ప్రతినిత్యం చెప్పుకొనుట ధర్మం. | యజ్ఞోపవీతము (జందెము)ను ఉపనయన సంస్కారము నుండి జీవితాంతము ధరించుట ధర్మము. బ్రహ్మచారి ఒక్కముడి యజ్ఞోపవీతము (జందెము)ను, గృహస్థులు ఐదు ముడుల యజ్ఞోపవీతము (జందెము)ను ధరించాలి. | నిత్యకర్మలు ప్రతి దినం చేయుట ధర్మం - బ్రహ్మ ముహూర్తమున అనగా ఉదయం 4-00 గంటల నుండి 6-00 గంటల లోపుల నిద్రమేల్కొని, భగవధ్యానము చేయుట, కాలకృత్యములు, స్నానము, సంద్య చేయుట. విభూతి, గంధం, కుంకుమ బొట్టు ధరించి ప్రాణాయామము, గాయత్రి మంత్రధ్యానము, సూర్య భగవానునికి ఆర్థ్యమును ఇచ్చుట. పితృ, పితామహులకు తర్పణం ఇచ్చుట గీత, కాలజ్ఞానము, వేదాధ్యయనము మొదలైనవి పఠించుట ధర్మం. | ప్రతి నిత్యం పంచ మహాయజ్ఞములు చేయుట ధర్మము. పంచ మహాయజ్ఞములు అనగా బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, అతిథి యజ్ఞము, భూత యజ్ఞములు ఆడంబరాలు లేకుండా త్రికరణ శుద్దిగా నిర్వహించాలి. | వైదిక కర్మలతోపాటు శిల్ప యజ్ఞములు - అయో, దారు, తామ్ర, శిలా, స్వర్ణ శిల్పములు చేయుట ధర్మము. వ్యాపారస్థులు, ఉద్యోగస్థులు వారి వారి దాయిల సంప్రదాయం ప్రకారం వారి దాయికి సంబంధించిన కనీసం రెండు లేదా మూడు పనిముట్లను వారి గృహంలో వాడాలి. పూజించాలి. | నైమిత్తిక కర్మలు అనగా షోడశ సంస్కారములు శాస్త్రం నిర్ణహించిన సమయమున చేయుట ధర్మము. 1. గర్భాదానము, 2. పుంసవనము, 3. సీమంతము, 4. జాతకర్మ, 5. నామకరణము, 6. నిష్క్రమణము, 7. అన్నప్రాశనము, 8. చౌలము/కేశఖండనము, 9. అక్షరాభ్యాసము, 10. ఉపనయనము, 11. బ్రహ్మచర్య వ్రతము, 12. స్నాతకము, 13. వివాహము, 14. గృహ ప్రవేశము, 15. వానప్రస్థము, 16. అంత్యేస్ఠి | వైదిక కర్మలు, నైమిత్తిక కర్మలు చేయునపుడు పురుషులు దోవతి, ఉత్తరీయమును, స్త్రీలు చీర జాకెట్టు లాంటి సంప్రదాయ దుస్తులు ధరించుట ధర్మము. | శాఖాహారమును (సాత్వికాహారము) భగవదార్పణ చేసి భుజించుట ధర్మం. ప్రతి విశ్వబ్రాహ్మణుడు తరచుగా తన సమీపంలోని విశ్వబ్రాహ్మణుల ఇంద్లకు వెళ్లి విషయములు తెలుసుకుంటూ, వారి యోగక్షేమములు విచారించుట ధర్మము. "విశ్వబ్రాహ్మణులు సదాచారము పాటింతురు గాక" |
History.....

మహానాటి కాలపు (1144-1506) విశ్వబ్రాహ్మణుల సంక్షిప్త చరిత్ర

బ్రాహ్మణులు పంచార్షేయులు, సప్తార్షేయులు అని రెండు విధములుగా ఉండిరి. అందు కులీన బ్రాహ్మణులు, మహా కులీనులనీ వేదములందు, భాష్యములందు ప్రఖ్యాతి చెందిన విశ్వకర్మ, త్వష్ట, బృహస్పతి, శుక్రాచార్యులు, విశ్వరూపుడు, అంగీరసుడు, భృగువు, సుధన్వుడు, ఋభువు మొదలైన బ్రహ్మర్షులు ఆచార్యులకు కూటస్థ పురుషులు అగు సానగాది పంచ ఋషులు గోత్ర, ప్రవరాదులు గలవారు అని, వేదోపనిచ్చాస్త్ర పురాణేతిహాసంబుల వలన తెలియబడుచున్నది.

మరియు సప్తార్షేయులు, వసిష్టాది సప్త ఋషుల సంతతివారు. వీరిని గూర్చి భారతాది సమస్త పురాణేతిహాసముల అందును, వజ్రసూచి, ఆర్షయాన్వయ ప్రదీపిక మొదలగు గ్రంథములయందు కలదు.

వసిష్టాది సప్తఋషులు శుశ్రూషచేసి, మయుడు అను విశ్వకర్మ వద్ద సర్వవిద్యలను అభ్యసించి, ఆయన అనుగ్రహమును సంపాదించి, షట్కర్మ అధికారములను పొంది ఉన్నారని వైవన్వత మహాపురాణమునందలి "మయకృప విమోక్షణ కథ" అధ్యాయమునందు కలదు.

వ్యాసుడు అను సప్తార్షేయ బ్రాహ్మణుడు పరిమళ చోళరాజునకు ఉంపుడుకత్తె కుమారుడు అగు కళీంగుడుచేత, పినతండ్రి అగు షణ్బులి చోళరాజును కపట ఉపాయముచేత చంపించి, కళీంగుడును ఆ రాజ్యమునకు రాజును చేసి, అతని సహాయము వలన పంచార్షేయుల స్వాధీనములో ఉన్న ఆచార్య పీఠమును బలవంతముగా తీసుకొన్నాడు. (పరిమళ చోళ చరిత్ర - చిత్తూరు జిల్లా తీర్పు 33వ పుట)

విశ్వబ్రహ్మ కులోత్సాహము, 4వ సంగ్రహము 16వ పుట ప్రకారము ఆదిశంకరాచార్య స్వాములవారు మొదలుకొని 59వ స్వాములవారి వరకు విశ్వబ్రాహ్మణ జాతీయులగు స్వాములే పీఠాధిపతులుగా ఉండిరి. వారందరకు "ఆచార్య స్వాములు" అను బిరుదు గలదు. 60వ పీఠాధిపతి నుండి సప్తార్షేయ బ్రాహ్మణజాతివారు "భారతీ స్వాములు" అను బిరుదుతో పీఠాధిపతులుగా వున్నారు అని నారాశంస బ్రాహ్మణ రత్నమాల (మరాఠి 38వ పుట) (విశ్వబ్రాహ్మణ ఇతిహాసము, 4వ సంగ్రహము 18వ పుట) తెలుపుచున్నది.

మరియు విశ్వమునకు ఆచార్యుడు అను "జగద్గురు" అను పేరును పెట్టుకొనుటకు విశ్వబ్రాహ్మణ కులస్థులకు మాత్రమే అధికారము కలదు. (విన్ల్సోగారి నిఘంటువు) (Winslows Dictionary) జగద్గీత కీర్తి, తిరువాంకూరు నివాసి, ప్రచ్చన్న బౌద్దమతము అగు అద్వైత వేదాంతము యొక్క స్థాపకుడు శ్రీ శంకరాచార్యుడు మాలినీ పట్టణములో విడిది చేసినఫ్ఫుడు తాను "జగద్గురు"డను అని చెప్పుకొనెను. తమ బిరుదమును ప్రాణ సమానముగా చూసుకొను దక్షిణ హిందూదేశ దేవకమ్మరులు (విశ్వబ్రాహ్మణులు) ఇతడు మోసగాడుగా కనిపించు చున్నాడని ఒకడు తమ ప్రత్యేకత్వమును అపహరించ ప్రయత్నిస్తున్నాడన్న కోపంతో అతనికి ఆ ఘనతగల అర్హతను ప్రశ్నించగా ఆ విఖ్యాత వేదాంతి (శ్రీ శంకరాచార్యుడు) ఈ విధముగా చెప్పెను.